ఇసుక లారీల అడ్డగింత

 



కమలాపురం మన జనప్రగతి మే 04:-

తమ గ్రామాల మీదుగా ప్రతి రోజూ వందలాది ఇసుక లారీలు రేయింబవళ్లు తిరుగుతున్నాయి. వాటి శబ్దాలకు నిద్ర రావడం లేదు. దుమ్ము, ధూళితో ఆయాసం, దగ్గు, జలుబు లాంటి రోగాలు వస్తున్నాయి. రోడ్లన్నీ పాడైపోయాని, తాము ఎలా జీవించాలని కమలాపురం మండలంలోని ఎర్రబల్లె, కొత్తపల్లె గ్రామాలకు చెందిన అమ్మణ్ణమ్మ, శీను, శంకర్, సుబ్బన్న, చెన్నమ్మ తదితరులు వాపోయారు.

పాపాఘ్ని నది వద్ద ఇసుక రీచ్ల నుంచి ఆయా గ్రామాల మీదుగా చాలా రోజుల నుంచి ఇసుకను తరలిస్తుండటం తెలిసిందే.  ఇసుక లారీలను ముందుకు కదలనీయకుండా గ్రామస్థులు అడ్డుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఇసుక లారీలను తిరగనీయొద్దని పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేదన్నారు. కనీసం దుమ్ము లేవకుండా నీళ్లు కూడా చల్లించడం లేదన్నారు. ఇలా అయితే తాము ఎలా జీవించాలని ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేదంటే ఇసుకలారీలను పూర్తి స్థాయిలో అడ్డుకుని ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.